Telugu News

 
రాజకీయాలను భ్రష్టుపట్టించిన ఘనత వైఎస్ కే దక్కుతుంది : ఎర్రన్నాయుడు E-mail
Sunday, 11 July 2010 16:17

Yerran_naiduతెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కె.ఎర్రన్నాయుడు మాట్లాడుతూ వైఎస్ మరణించారన్న బాధతో అసలు శ్రీకాకుళం జిల్లాలో ఎవ్వరూ చనిపోలేదని, వివిధ కారణాలతో మృతి చెందిన 14 మంది మరణాలను వైఎస్ ఖాతాలో వేసుకుని, ఆయన తనయుడు జగన్ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ, ఆ 14 మంది పేర్లతో ఒక జాబితాను విడుదల చేశారు. ఓదార్పు యాత్ర పేరుతో రాజకీయ దండయాత్ర చేస్తున్న జగన్, వైఎస్ పోయాక రాజకీయాలు అట్టడుగు స్థాయికి దిగజారాయి అనడం విడ్డూరంగా ఉందని, అసలు రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి రాజకీయాలను భ్రష్టుపట్టించిన ఘనత వైఎస్ దేనని అన్నారు.

ఓదార్పు యాత్రలో జగన్ పరామర్శలకు కేవలం 4 గంటలు కేటాయించి, మిగతా 33 గంటలు తన రాజకీయ ప్రాబల్యాన్ని పటిష్టం చేసుకోవడానికి మండలస్థాయి నాయకులతో మంతనాలు జరపడానికే కేటాయించారని ఎర్రన్నాయుడు ఎద్దేవా చేశారు. అంతేకాక యాత్రలో 500 వాహనాలు కాన్వాయ్ గా వెళుతున్నాయని, ఆ ఖర్చుతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.లక్షలు సాయం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఆరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, చేనేత కార్మికులు చాలామంది ఉన్నారని, వారినెందుకు జగన్ పరామర్శించడం లేదని జగన్ ను ఎర్రన్నాయుడు ప్రశ్నించారు.

వైఎస్ హయాంలో విపరీతంగా అవినీతికి పాల్పడి రూ.కోట్లు దండుకున్న నాయకులే ఇప్పుడు ఆ రుణం తీర్చుకోవడానికి డబ్బులు వెదజల్లి జగన్ యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారని, నిజంగా జగన్ కు ప్రజాబలం ఉంటే ఇతర జిల్లాల నాయకులు వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చెయ్యవలసిన అవసరం లేదని ఎర్రన్నాయుడు అభిప్రాయపడ్డారు.

 
Follow us on Twitter

Who's Online

We have 50 guests online

Advertisement