Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ICC WORLD CUP 2011

సచిన్ vs మురళీ : కప్ గిఫ్ట్ ఎవరికి దక్కేనో...

అంతిమ సమరానికి అందరూ సిద్దమవుతున్నారు. ఈ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఓ ఇద్దరు ఆటగాళ్లకు మాత్రం ప్రత్యేక మ్యాచ్ కానుంది. ఒకరు బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మరొకరు బౌలింగ్ దిగ్గజం మురళీ ధరణ్. ఇద్దరు ఇద్దరే... ఎవరికీ వారే సాటి. ఇద్దరిలో ఎవరిని తక్కువ చేసి చూడలేము. ఇద్దరికీ ఇదే ప్రపంచ కప్ చివరి మ్యాచ్. 39 ఏళ్ల మురళీ ఈ మ్యాచ్ తర్వాత రిటైర్ కానున్నట్లు ముందే ప్రకటించాడు. 38 ఏళ్ల సచిన్ ఇంకా కొంత కాలం ఆడగాలిగినా మళ్ళీ  ప్రపంచ కప్ ఆడే అవకాశం లేదు.

కావున ఇద్దరూ తమ చివరి(ప్రపంచ కప్ లో) మ్యాచ్ లో రాణించి తమ జట్టుకు కప్ తేవాలనుకుంటున్నారు. వీరే కాదు ఇటు భారత ఆటగాళ్ళు సచిన్ కోసం, అటు లంక ఆటగాళ్ళు మురళీ కోసం కప్ గెలిచి వారికి కానుకగా ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. భారత ఆటగాళ్ళు టోర్నీ ముందు నుంచి ఇదే విషయాన్ని చెపుతున్నారు కూడా..

బ్యాటింగ్ లో లిటిల్ మాస్టర్ చేయని రికార్డు లేదు. దాదాపు రికార్డులన్నీ సచిన్ ఖాతాలోనే ఉన్నాయి. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. ఇక మురళీ  టెస్టు మ్యాచుల్లో 800 వికెట్లు, వన్డే మ్యాచుల్లో 534 వికెట్లు తీసుకొని ప్రపంచంలోనే అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.

ప్రపంచ కప్ విషయానికి వస్తే అత్యధిక పరుగుల రికార్డ్ సచిన్ ఖాతాలోనే ఉంది. కాని అత్యధిక వికెట్లు మాత్రం ఆస్ట్రేలియా బౌలర్ మెక్ గ్రాత్(71) పేరిట ఉంది. మురళీ(67) రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ ప్రపంచ కప్ లో ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ 464 పరుగులు చేశాడు, కాగా గాయాలతో బాధపడుతున్నప్పటికీ మురళీథరన్ 15 వికెట్లు తీశాడు. ఐతే ప్రపంచ గిఫ్ట్ ఎవరికి వస్తుందో వేచి చూద్దాం....!