Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ICC WORLD CUP 2011

ధోనీ సేనపై కాసుల పంట

ప్రపంచ కప్ గెలిచిన ధోని సారధ్యంలోని భారత జట్టుపై ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపిస్తున్నారు. 28 సంవత్సరాల సుదీర్ఘ కల నెరవేర్చిన భారత జట్టుకు భారీ తాయిలాలు సమర్పించుకుంటున్నారు. బిసీసీఐ కెప్టెన్ ధోనీకి 2కోట్లు, జట్టు సభ్యులకు తలా ఒక కోటి, జట్టు సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి 50 లక్షలు ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం జట్టులో ప్రతి ఆటగాడికి బెంగుళూరులో ఇళ్ళ స్థలాలు కేటాయించింది.

అలాగే భారతీయ రైల్వే జట్టు సభ్యులందరికీ ఏసీ కోచ్‌లలో ఉచితంగా ప్రయాణించేందుకు జీవితకాల పాసులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆడీ కంపెనీ యువరాజ్ కి విశాలవంతమైన  లగ్జరీ కారును బహుకరించింది.

ఢిల్లీ ప్రభుత్వం ధోనీకి 2కోట్లు, సెహ్వాగ్, గంభీర్, కోహ్లీ, నేహ్రాలకు తలా కోటి రూపాయలు ప్రకటించింది. గుజరాత్ ప్రభుత్వం యూసఫ్ పఠాన్, మునాఫ్ పటేల్ లకు ఏకలవ్య పురస్కారం, తలా కోటి రూపాయలు ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రైనా, పీయూష్ లకు కాన్షీరాం అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది.

ఉత్తరాఖాండ్ ధోనీకి ఖేల్ రత్న అవార్డు, ధోనీ పేరిట స్టేడియం, ముస్సోరీలో సచిన్, ధోనీ లకు ఇల్లు, జట్టు సభ్యులకు జీవిత కాలం అతిధి హోదా ఇవ్వనున్నట్లు తెలిపింది. హర్భజన్, యువరాజ్ లకు పంజాబ్ తలా కోటి, మహారాష్ట్ర నుంచి సచిన్, జహీర్ లకు కోటి, జార్ఖండ్ దోనీకు ఖేల్ రత్న, క్రికెట్ అకాడమికి స్థలం కేటాయించనున్నట్లు తెలిపింది.

హర్యానా సెహ్వాగ్, నేహ్రాలకు క్రీడా పురస్కారాలు, సెహ్వాగ్ పేరు మీద క్రికెట్ అకాడమీకి స్థలాలు ప్రకటించింది. ఎయిర్ ఇండియా తన ఉద్యోగులైన యువరాజ్, ధోని, హర్భజన్, రైనాలకు పదోన్నతులు కల్పించనుంది.