Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ఏడాదిలో మరో 45 బిగ్ బజార్ స్టోర్లు

ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన వ్యాల్యూ రిటైల్ సంస్థ బిగ్‌బజార్... వేగంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఏడాది కాలంలోనే దేశవ్యాప్తంగా 45 బిగ్‌బజార్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ జాయింట్ సీఈవో సదాశివ్ నాయక్ చెప్పారు. ఈ నెల 25 నుంచి 29 వరకు బిగ్ బజార్ అందిస్తున్న ప్రత్యేక డిస్కౌంట్ల కార్యక్రమం ‘సబ్సే సస్తే 5 దిన్’ పర్యవేక్షణకై శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు.

ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న కొనుగోళ్ల తీరు డిసెంబర్ నుంచి మెరుగుపడింది. వినియోగదారులు అధిక మొత్తంలో కొనుగోలు చేయడం ప్రారంభించారు. విలువైన వస్తువుల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగి అధిక ధరలు కొనసాగినప్పుడు దుస్తులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అమ్మకాల్లో మందగమనం ఉంది. కానీ, ప్రస్తుతం వాటిలోనూ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఆహారం, గృహోపకరణాలపై ఎలాంటి ప్రభావం లేదు. ప్రత్యేకంగా మేం ప్రారంభించిన ‘సబ్సే సస్తే 5 దిన్’ సందర్భంగా అన్ని రకాల సెగ్మెంట్లలోనూ మెరుగైన డిస్కౌంట్లు అందిస్తున్నాం. దేశవ్యాప్తంగా 85 నగరాల్లోని 200 బిగ్ బజార్లు, ఫుడ్ బజార్లలో ఉత్పత్తిని బట్టి 60 శాతం వరకు తగ్గింపును ఇస్తున్నాం. దీంతో అన్ని సెగ్మెంట్లోనూ వృద్ధి కనిపిస్తోంది.