Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

12 వారాల గరిష్టానికి రూపాయి

విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో దేశీ స్టాక్‌మార్కెట్స్ పెరుగుతున్న నేపథ్యంలో రూపాయి మరింత పుంజుకుంటోంది. శుక్రవారం ఏకంగా 77 పైసలు ఎగిసి 12 వారాల గరిష్ట స్థాయికి చేరింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 49.31 వద్ద ముగిసింది. చివరిసారిగా గతేడాది నవంబర్ 4న 49.10 స్థాయి నమోదైంది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనంగా ఉండటంతో ఎగుమతిదారులు డాలర్లను విక్రయిస్తుండటమే రూపాయి బలపడటానికి కారణమని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. శుక్రవారం ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ (ఫారెక్స్)లో రూపాయి మారకం విలువ 49.29-50.09 మధ్య ట్రేడయ్యి చివరికి 77 పైసల లాభంతో ముగిసింది.

గత నెల రోజుల వ్యవధిలో రూపాయి మారకం విలువ ఆల్‌టైం కనిష్టమైన 54.30 స్థాయి నుంచి సుమారు 10 శాతం మేర బలపడినట్లయింది. 49.20 వద్ద తదుపరి మద్దతు.రూపాయి విషయంలో అన్నీ సానుకూల సంకేతాలే కనిపిస్తున్నాయని ఇండస్‌ఇండ్ బ్యాంక్ హెడ్ (అసెట్ లయబిలిటీ కమిటీ) జే మోజెస్ హార్డింగ్ చెప్పారు. విదేశీ నిధుల ప్రవాహం పుష్కలంగా ఉంటోందన్నారు. డాలర్‌కి సంబంధించి తదుపరి మద్దతు స్థాయి 49.20 వద్ద ఉందని, అది కానీ బ్రేక్ అయితే 48.51 స్థాయికి చేరే అవకాశముందని హార్డింగ్ వివరించారు.