Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

తగ్గిన ఆంధ్రాబ్యాంక్ లాభం

ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి(క్యూ3) నిరాశాజనకమైన ఫలితాలను ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికరలాభం 8.45 శాతం క్షీణించి రూ.330.91 కోట్ల నుంచి రూ.303.17 కోట్లకు తగ్గింది. కార్పొరేట్ రుణాల పునర్ వ్యవస్థీకరణ, వడ్డీ లాభదాయకతపై ఒత్తిడి లాభాలు తగ్గడానికి కారణాలని బ్యాంక్ సీఎండీ బి.ఎ.ప్రభాకర్ తెలిపారు. గురువారం ఇక్కడ మీడియా సమావేశంలో ఆయన తమ బ్యాంకు ఫలితాలను ప్రకటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రూ.3,675.77 కోట్ల విలువైన రుణాలను పునర్వ్యవస్థీకరించామని దీని వల్ల నష్టాల ప్రొవిజనింగ్ కోసం రూ.309 కోట్లు కేటాయించాల్సి రావడంతో లాభాలపై ప్రభావం చూపిందన్నారు.మిగిలిన అన్ని విషయాల్లో బ్యాంకు పనితీరు బాగుందని, వడ్డీ లాభదాయకతపై స్వల్పంగా ఒత్తిడి ఉన్నప్పటికీ వచ్చే త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించగలమన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతకుముందు సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే నిరర్థక ఆస్తులు పెరిగినప్పటికీ, రెండో త్రైమాసికంతో పోలిస్తే తగ్గడం మొదలయ్యిందని అన్నారు. నాలుగో త్రైమాసికంలో రూ.500 కోట్ల మొండి బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే రూ. 150 కోట్లు వసూలు చేశామన్నారు. ఈ సంవత్సరం మొత్తం మీద డిపాజిట్లలో 18%, రుణాల్లో 16-18% వృద్ధిని సాధించగలమని చెప్పారు. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాల వడ్డీ రేట్లను పెంచే ఆలోచన లేదని, రుణాల రేట్లుకూడా పెరిగే అవకాశం లేదన్నారు.