Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

నిర్మాత, నటుడు పుండరీకాక్షయ్య మృతి

ప్రముఖ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య (78) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పుండరీకాక్షయ్య ఈరోజు ఉదయం ఆరు గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా చౌటుపల్లి.

తొలిసారిగా పుండరీకాక్షయ్య భక్తప్రహ్లాద చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఎన్టీఆర్, త్రివిక్రమరావుతో కలిసి పుండరీకాక్షయ్య నేషనల్ ఆర్ట్ థియేటర్ స్థాపించారు. జయసింహ, మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన లాంటి విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. పుండరీకాక్షయ్య నిర్మించిన చివరి చిత్రం రాఘవయ్యగారి అబ్బాయి. తెలుగులో 20, కన్నడలో ఆరు చిత్రాల్లో పుండరీకాక్షయ్య వివిధ పాత్రలు పోషించారు. కాగా విజయశాంతి కథానాయికిగా నటించిన కర్తవ్యం చిత్రంలో ముద్దుకృష్ణ పాత్రలో ఆయన మెప్పించారు. పుండరీకాక్షయ్య మృతి పట్లు తెలుగు, తమిళ చిత్రసీమ ప్రముఖలు సంతాపం తెలిపారు.