Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

యూపీలో జేడీయూతో జతకట్టిన తృణమూల్

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ ఝలకిచ్చింది. పశ్చిమ బెంగాల్లో మిత్రపక్షం కాంగ్రెస్‌తో కయ్యం పెట్టుకున్న తృణమూల్... యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేతో జత కట్టేందుకు సిద్ధమవుతోంది! సీట్ల సర్దుబాటు ఒప్పందంపై ఎన్డీయే భాగస్వామి అయిన జేడీ(యూ)తో చర్చలు జరుపుతోంది.

అయితే అవి ఇంకా ఓ కొలిక్కి రాలేదని తృణమూల్ నేత, కేంద్ర మంత్రి సుల్తాన్ అహ్మద్ తెలిపారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్న తృణమూల్.. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో కనీసం 200 చోట్ల పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. కాంగ్రెస్ నేత, మంత్రి మనోజ్ చక్రవర్తి శనివారం మమతా బెనర్జీ కేబినెట్ నుంచి తప్పుకోనున్నారు. ఆయన రాజీనామా చేసేందుకు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం అంగీకారం తెలిపారు.