Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

డిఎంకె మాజీ మంత్రి స్వామినాథన్‌ అరెస్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె నేతలపై పంజా విసురుతూనే ఉన్నారు. డిఎంకె నాయకుడు, మరో మాజీ మంత్రి వెల్లకోవిలి స్వామినాథన్‌ను సోమవారం ఉదయం అరెస్టు చేశారు. కరుణానిధి మంత్రి వర్గంలో జాతీయ రహదారుల మంత్రిగా పనిచేసిన స్వామినాథన్‌ను అక్రమ భూకబ్జా ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. భూ కబ్జా కేసుల్లో  ఇప్పటివరకూ అరెస్ట్ అయినవారిలో స్వామినాథన్ నాలుగో వ్యక్తి.

ఇంతకు ముందు వీరపాండి అరుముగం, కె. పొన్ముడి, కెఎన్ నెహ్రూ అరెస్టయ్యారు. వీరికి ఈ కేసుల్లో బెయిల్ కూడా లభించింది. మరో మాజీ మంత్రి కెపి సామి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటూ జైలులో ఉన్నారు. ఆయనకు కూడా ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమైన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే అరెస్టులు జరుగుతున్నాయని జయలలిత అంటున్నారు. అయితే రాజకీయ కక్షలో భాగంగానే అరెస్టులు చేస్తున్నారని కరుణానిధి విమర్శిస్తున్నారు.