తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీని బహిష్కరిద్దామంటూ ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తమిళానికి జాతీయ అధికార భాష గుర్తింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం రాత్రి కాంచీపురంలో జరిగిన తమిళ భాషోద్యమ త్యాగుల సంస్మరణ సభలో కరుణ ఈ వ్యాఖ్యలు చేశారు.
ద్రవిడ పార్టీ రూపకర్త, దివంగత అన్నాదురై స్ఫూర్తితో హిందీ ఆధిపత్యాన్ని కట్టడి చేయడానికి డీఎంకే ఉద్యమించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. మాతృభాష పరిరక్షణ కోసం హిందీని బహిష్కరించేందుకు డీఎంకే వెనకాడబోదన్నారు. అన్నాదురై స్వస్థలం కాంచీపురంలో ఈ సభ జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. హిందీని బహిష్కరించేందుకు ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.