Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

కుంభకోణం అవాస్తవం : ఇస్రో మాజీ చైర్మన్

ఎస్-బాండ్ కేటాయింపుల కోసం యాంత్రిక్స్-దేవాస్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం వెనుక కుంభకోణం జరిగిందంటూ వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ పునరుద్ఘాటించారు. అంతేకాకుండా తనపై వచ్చిన ఆరోపణల వెనుక ప్రస్తుత ఛైర్మన్ రాధాకృష్ణన్ హస్తముందని ఆయన ఆరోపించారు. ఈ ఒప్పందం వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలపై మాధవన్ నాయర్ ఘాటుగానే స్పందించారు.

రద్దైన యాంట్రిక్స్-దేవాస్ ఒప్పందం వెనుక కుంభకోణం జరిగిందనడాన్ని తోసిపుచ్చుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఈ ఒప్పంద వల్ల దేశ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనడం సరికాదన్నారు. స్పెక్ట్రమ్, శాటిలైట్ ట్రాన్స్‌పాండర్ల లీజు రెండింటినీ కలగాపులగం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇవి రెండూ వేర్వేరు అంశాలని, ట్రాన్స్‌పాండర్ల లీజు వ్యవహారాలను మాత్రమే ఇస్రో చూస్తుందని నాయర్ స్పష్టం చేశారు.

ఈ మొత్తం వ్యవహారంతో స్పెక్ట్రమ్ వినియోగంతో కానీ మరోదానితో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనికి సంబంధించి ప్రస్తావిస్తున్న రూ.20 వేల కోట్లు.. తదితరాలు పూర్తిగా పొరపాటని వివరించారు. ఇస్రో వార్షిక బడ్జెట్టే రూ.4 వేల కోట్లని, రెండు ట్రాన్స్‌పాండర్లను సరఫరా చేయడం ద్వారా ఇస్రో రూ.20 వేల కోట్లు ఆర్జిస్తే.. ఇస్రోకు ప్రభుత్వ సాయం అవసరమేముందని మాధవన్ ప్రశ్నించారు.