26/11 ముంబై దాడుల్లో కీలక నిందితులు తొమ్మిది మందిని తమకు అప్పగించాలని అమెరికా, పాకిస్తాన్ లను భారత్ కోరనుంది. ఇందుకు సంబందించిన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఈ జాబితాలో పాకిస్తానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హీడ్లీ, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, మరో ఇద్దరు ఐఎస్ఐ అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతూ నిందితుల అప్పగింతకు సంబందించిన వినతులను త్వరలోనే అమెరికా, పాకిస్తాన్ లకు పంపుతామని తెలిపారు.
తమ జాబితాలోని తొమ్మిది మంది ముంబై దాడి కుట్రలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని వివరించాయి. ముంబై దాడి కేసులో హెడ్లీ, అతని అనుచరుడు రాణా, అఫీజ్ సయీద్, ముంబై కుట్ర దారు రెహ్మాన్ లఖ్వి, ఆల్ ఖైదా ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ, సాజిద్ మాలిక్, మాజీ పాకిస్తాన్ సైన్యాధికారి అబ్దుల్ రెహ్మాన్ హష్మీలపై జాతీయ దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసిన నెల తర్వాత ప్రభుత్వం వారి అప్పగింతకు వినతులు సిద్దం చేసింది.
వీరితో పాటి ఐఎస్ఐకి సహకరించినట్లు భావిస్తున్న పాకిస్తాన్ కు చెందిన మేజర్ ఇక్బాల్, మేజర్ సమీర్ ఆలీలను కూడా అప్పగించాలని ప్రభుత్వం కోరనుంది. ఈ వినతులను పరిగణలోకి తీసుకుని అమెరికా, పాకిస్తాన్ లలోని కోర్టులు నిందితులను అప్పగిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
| < Prev | Next > |
|---|


