Thursday, May 17th

RSS

Telugu News - Online Telugu News Portal

వంటకాలు

కారప్పూసతో మైసూర్ పాక్

  • కావలసినవి
  • ఉప్పులేని కారప్పూస - 400 gms
  • కోవా - 400 gms
  • పాలు - 250 ml
  • చక్కెర - 300 gms
  • నెయ్యి - 200 gms
తయారుచేయు విధానం
కారప్పూసను చేతితో మెత్తగా చిదిమి పక్కన పెట్టుకోవాలి. మందపాటి గిన్నెలో పాలు పోసి వేడెక్కిన తర్వాత అందులో కోవా వేసి మొత్తం కలిసేంతవరకు కలియబెట్టాలి.ఇప్పుడు కారప్పూస పొడి, చక్కెర వేసి నెమ్మదిగా కలియబెడుతూ వుండాలి. అంతా గట్టిపడిన తర్వాత నెయ్యి వేస్తూ మెల్లిగా కలియబెట్టాలి. నెయ్యి మొత్తం వేసిన తర్వాత కొద్ది సేపు పొయ్యి మీద ఉంచి కిందకు దింపేయాలి. మందపాటి పళ్ళేనికి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోయాలి. దానిని సమానంగా సర్దాలి. చల్లారిన తర్వాత కావలసిన ఆకారంలో ముక్కలు చేసుకోవాలి ఇవి వారం వరకు నిల్వ ఉంటాయి.

.

పుట్నాలపప్పు లడ్డూలు

  • కావలసినవి
  • పుట్నాల పప్పు - 100 gms
  • చక్కెర - 100 gms
  • ఏలకులు - 3
  • నెయ్యి - 75 gms
తయారుచేయు విధానం
పుట్నాల పప్పు శుభ్రపరచుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అలాగే చక్కెర కూడా ఏలకులతో కలిపి మెత్తగా పొడి చేసుకోవాలి. రెండింటిని బాగ కలియబెట్టాలి. కరిగించిన నెయ్యి పోస్తూ ఉండలు కట్టుకోవాలి. ఇది చాల త్వరగా చేసుకునే స్వీట్.

.

కొబ్బరి ఉండ్రాళ్ళు

  • కావలసినవి
  • పచ్చికొబ్బరి తురుము - 3 కప్పులు
  • బియ్యం పిండి - 2 కప్పులు
  • బెల్లం - 2 కప్పులు
  • పంచదార - 5 చెంచాలు
  • యాలకుల పొడి - 2 చెంచాలు
  • నెయ్యి - 4 చెంచాలు
  • జీడిపప్పు పలుకులు - అర కప్పు
తయారుచేయు విధానం
ముందుగా బాణలిలో నెయ్యి వేడి చేసి, అందులో కొబ్బరిని కొంచెం వేయించి, అందులో బెల్లం కలిపి ఉడకనివ్వాలి.జీడిపప్పు పలుకులను కూడా వేసి మాడకుండా కలుపుతూ ముద్దగా అయ్యేవరకు ఉడికించాలి. తర్వాత దింపేయాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని పంచదార, యాలకులపొడి, నెయ్యి వేసి అరకప్పు నీళ్ళు పోసి బాగా మరిగించాలి. దింపేసి అందులో బియ్యం పిండీని పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమం గట్టిగా ఉండాలి. పలుచగా ఉంటే కొంచెం పిండిని వేసి కలపవచ్చు. కొబ్బరి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి. బియ్య్యం పిండిని కాస్త పెద్ద ఉండను తీసుకుని వెడల్పుగా తట్టి, దాని మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి మూసేసి కావల్సిన ఆకారంలో చేసుకోవచ్చు. కావాలంటే బియ్యం పిండిలో కేసరి రంగును కాని, కుంకుమపువ్వు కాని వేసుకోవచ్చు.

.

కొబ్బరి బొబ్బట్లు

  • కావలసినవి
  • పచ్చి కొబ్బరి తురుము-250 gm
  • బెల్లం-250 gm
  • మైదాపిండి-250 gm
  • నూనె-ఒక స్పూను
  • నెయ్యి-అరకప్పు
  • యాలకులపొడి-1 tsp
తయారుచేయు విధానం
కొబ్బరితురుము, పొడి చేసుకున్న బెల్లం కలిపి కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడకనీయాలి. మొత్తం ఉడికి గట్టిపడ్డాక యాలకులపొడి రెండు స్పూనుల నెయ్యి వేసి కలిపి చిన చిన్న వుండలు చేసుకోవాలి. మైదాపిండిలో కొంచెం నూనె నీళ్ళు పోసి పూరి పిండిలా కలిపి రెండుగంటలు నాననివ్వాలి. తరువాత ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని నూనె చేతితో వెడల్పు చేసుకుని మధ్యలో పూర్ణం వుండ పెట్టి అంచులు మడిచి బొబ్బట్టులా వత్తుకుని వేడెక్కిన పెనంపై వేసి నేయ్యి వేస్తు రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

గుమ్మడికాయ పులుసు

  • కావలసినవి
  • గుమ్మడికాయ-250 gms
  • ఉల్లిపాయలు-2
  • పచ్చిమిర్చి-2
  • బెల్లం-50 gms
  • కారం-1 tsp
  • ఉప్పు-తగినంత
  • పసుపు-చిటికెడు
  • ఇంగువ-చిటికెడు
  • ధనియాలు-1 tsp
  • మెంతులు-1/2 tsp
  • పోపు గింజలు-1 tsp
  • ఎండుమిర్చి-2
  • నూనె-2 tsp
  • కరివేపాకు-1 రెబ్బ
  • కొత్తిమిర-1 కట్ట
  • శనగపిండి-2 tbsp
  • చింతపండు-పెద్ద నిమ్మకాయంత
తయారుచేయు విధానం
గుమ్మడికాయ చెక్కు తీసి బాగా పెద్ద ముక్కలు తరగాలి.ఉల్లి, పచ్చిమిర్చి,తరిగి అందులో వేసి కాసిన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టాలి. చింతపండు కడిగి నానబెట్టి పులుసు తీసి ఉడికిన గుమ్మడి ముక్కలలో పోయాలి. కారం, బెల్లం, పసుపు , ఉప్పు కూడా వేయాలి. ధనియాలు, ఇంగువ, మెంతులు కలిపి ఎర్రగా వేయించి పొడి చేసి పులుసులో వేయాలి.ఈ పొడి వేసినందువల్ల పులుసు రుచి ఎక్కువగా ఉంటుంది. పులుసు బాగా ఉడికిన తర్వాత శనగపిండి కొద్దిగా నీళ్ళలో కలిపి పులుసులో పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి.కాసేపు ఉడికిన తర్వాత దింపి పోపు పెట్టాలి. కరివేపాకు, కొత్తిమిర కూడా కలపాలి. ఈ ధప్పళాన్ని చేసి, చూసి తింటే తెలుస్తుంది దీని రుచి అమోఘం.

చికెన్ గోంగూర

  • కావలసినవి
  • చికెన్ - 1/2 kg
  • గోంగూర - 2 cups
  • అల్లం వెల్లుల్లి - 2 tsp
  • ఉల్లిపాయలు - 3
  • కొత్తిమిర - 1/2 cup
  • చుక్కకూర - 1/2 cup
  • ఉప్పు - తగినంత
  • కారం - 2 tsp
  • పసుపు - చిటికెడు
  • పచ్చిమిర్చి - 3
  • గరం మసాలా - 1 tsp
  • నూనె - 100 gm
తయారుచేయు విధానం
చికెన్ శుభ్రంగా కడిగి, ఉప్పు, కారం , పసుపు వేసి కలిపి ఉంచాలి. గోంగూర, చుక్కకూర శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. గోంగూరలో చుక్కకూర కలపడం వల్ల రుచి పెరుగుతుంది. జిగురుగా లేకుండా బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు పోసి, మెత్తగా ఉడికించి చల్లారాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి ముద్ద , పసుపు, కారం వేసి కొద్దిగా వేపాలి. తర్వాత చికెన్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగ కలియబెట్టి మరి కొద్ది సేపు వేయించాలి. రెండు గ్లాసుల నీళ్ళు పోసి పది నిమిషాలు ఉడికిన తర్వాత గోంగూర ముద్ద వేసి కలిపి మరో పది నిమిషాలు ఉడికించి కొత్తిమిర, గరం మసాలా వేసి కలిపి దింపేయాలి.బిర్యానీలోకి, అన్నంలోకి, రొట్టెలలోకి కూడా ఈ కూర బాగుంటుంది.