ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి సంచలనం నమోదైంది. స్థానిక ఆశాకిరణం, యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ సమంతా స్టోసుర్‌కు తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన స్టోసుర్‌కు అన్‌సీడెడ్ సొరానా కిర్‌స్టీ (రుమేనియా) షాక్ ఇచ్చింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో కిర్‌స్టీ 7-6 (7/2), 6-3తో స్టోసుర్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.
మరోవైపు ‘గ్లామర్ గర్ల్స్’ మరియా షరపోవా (రష్యా), అనా ఇవనోవిచ్ (సెర్బియా), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) సునాయాస విజయాలతో శుభారంభం చేశారు. 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాక మరో ‘గ్రాండ్‌స్లామ్’ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న షరపోవా కేవలం 58 నిమిషాల్లో 6-0, 6-1తో జిసేలా డుల్కో (అర్జెంటీనా)ను చిత్తు చేసింది. మ్యాచ్ మొత్తంలో డుల్కో తన సర్వీస్‌ను ఒక్కసారీ నిలబెట్టుకోలేదు. ఆమె సాధించిన ఏకైక గేమ్ షరపోవా సర్వీస్‌లో రావడం గమనార్హం. మరో మ్యాచ్‌లో 21వ సీడ్ ఇవనోవిచ్ 6-0, 6-3తో లార్డెస్ లినో (స్పెయిన్)పై గెలిచింది.