Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

మారని తీరు : టి20లోనూ భారత్ ఓటమి

బుధవారం జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా 31 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ధోని సేన 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కెప్టెన్ ధోని (43 బంతుల్లో 48 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ఆఖర్లో కాస్త వేగంగా ఆడటంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. గంభీర్ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు), విరాట్ కోహ్లి (21 బంతుల్లో 22; 1 సిక్సర్) మినహా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు.

ఆస్ట్రేలియా స్పిన్నర్ డేవిడ్ హస్సీ (2/4) అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీయగా... క్రిస్టియాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. బ్రెట్‌లీ, హాగ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు ముగ్గురూ (డోహర్తి, హస్సీ, హాగ్)  ఓవర్‌కు ఆరు పరుగుల చొప్పున కూడా ఇవ్వకపోవడం విశేషం. అంతకుముందు భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (43 బంతుల్లో 72; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అర్ధసెంచరీ చేశాడు. మరో ఓపెనర్ వార్నర్ (14 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్సర్లు ) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. చివర్లో డేవిడ్ హస్సీ (30 బంతుల్లో 42; 1 ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీస్కోరు అందించాడు. భారత బౌలర్లలో అశ్విన్, వినయ్, రైనా, రాహుల్ శర్మ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆసీస్ సంచలనం వేడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.