Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

ఇకనుంచి 'ధర్మశాలలో' ప్రాక్టీసు

విదేశాల్లో వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేసేందుకు బీసీసీఐ ప్రణాళికలను రచిస్తోంది. ఇందులో భాగంగా యువ క్రికెటర్లకు భారత్‌లో అత్యంత వేగవంతమైన పిచ్‌గా పేరుగాంచిన ధర్మశాల పిచ్‌పై శిక్షణ ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం రెండు వారాల పాటు ప్రాక్టీస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలోని బీసీసీఐ అకాడమీల నుంచి ఎంపిక చేసిన యువ క్రికెటర్లు ఈ క్యాంప్‌లో తమ నైపుణ్యానికి పదును పెట్టుకోనున్నారు. ఇటీవల ముగిసిన జాతీయ క్రికెట్ అకాడమీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ధర్మశాలలో వాతావరణ పరిస్థితులు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లను పోలి ఉండటం కూడా ఇందుకు కారణం. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై స్వింగ్‌ను ఎలా అదుపు చేయాలన్న అంశంపై ఇక్కడ పూర్తి శిక్షణ ఇవ్వనున్నారు. అయితే సెప్టెంబర్‌లో జరిగే బోర్డు వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుంటారు.