APReporter.com

 
డీఎస్ ఓటమి కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ విద్యార్ధి E-mail
Saturday, 31 July 2010 12:20

తెలంగాణ రాష్ట్రం కోసం హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరో విద్యార్ధి ఆత్మ బలిదానం చేశాడు. మెదక్ జిల్లా న్యాలకల్ మండలం బసంతపూర్ కు చెందిన ఇషాన్ రెడ్డి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ పూర్తి చేసి జిఆర్ఇకి ప్రిపేరవుతున్నాడు. నిన్న రాత్రి ఇషాన్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇషాన్ తన ఆత్మహత్యకు గల కారణాన్ని తెలియజేస్తూ ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు.

అందులో పీసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఓడిపోతే తాను ప్రాణత్యాగం చేసుకుంటానని మైసమ్మకు మొక్కుకున్నానని, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకుంటున్నానని ఇషాన్ రాశాడు. అలాగే తన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించవద్దని, తెలంగాణ అమరవీరుల స్థూపం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్లాలని ఇషాన్ కోరాడు.

అలాగే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, తెదేపా నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి తెలంగాణ ద్రోహులని ఇషాన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్ధి నాయకులు మాట్లాడుతూ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని, ఎవరూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

 
Follow us on Twitter

Who's Online

We have 35 guests online

Advertisement