తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ తనపై ఎవరు పోటీ చేసినా డిపాజిట్ కూడా దక్కదని, డబ్బున్న వ్యక్తిని తమపై పోటీకి దింపి తెలంగాణ ఓట్లు కొనలేరని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోవడానికి, ఉధృతంగా సాగిన ఉద్యమం చప్పబడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చంద్రబాబు దుష్ప్రచారం చేయించారన్నారు. అలాగే ఇపుడు తనకు వ్యతిరేకంగా ఈ తరహా ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై దుష్ప్రచారం చేయడం మాని... నాగర్‌కర్నూల్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో నాగర్ కర్నూలు శాసనసభా స్థానానికి ఉపఎన్నిక వస్తోంది.