Wednesday, Feb 22nd

Telugu News - Online Telugu News Portal

సీఎం అయ్యాక తొలి సంతకం వ్యాట్ పైనే : జగన్

తాను ముఖ్యమంత్రిని అయితే వ్యాట్(విలువ ఆధారిత పన్ను) రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లాలోని నరసారావుపేటలో వ్యాట్ పెంపును నిరసిస్తూ ఆ పార్టీ ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మెప్పు పొందేందుకే కాంగ్రెసు నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. వారికి ప్రజల దుస్థితి పట్టడం లేదన్నారు. వ్యాట్ పెంపు వల్ల ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.1400 పడుతుందన్నారు.

వ్యాట్ పన్నును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికి రూ. 700 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. అసలు జూన్, జనవరి నెలలకి తేడా తెలియని ఆనం రాంనారాయణ రెడ్డి ఆర్థికమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎలా బాగుపడుతుందని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే సమయం ఆసన్నమైందన్నారు. వ్యాట్ రద్దుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.