Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

యానాం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి : హర్షకుమార్

యానాంలో రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ వద్ద జరిగిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని అమలాపురం ఎంపీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లిలో కార్మిక నేత ముచ్చా మురళీమోహన్ అంత్యక్రియల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీబీఐ విచారణ చేపడితేనే కార్మికుల కష్టాలు, యాజమాన్యం దోపిడీ, సిరామిక్స్ కి ముడిసరుకు ఎక్కడ నుంచి కొల్లగొడుతున్నారు, ఎంత లాభాలు ఆర్జిస్తున్నారు తదితర విషయాలన్నీ వెలుగులోకి వస్తాయాన్నారు.

సీబీఐ విచారణ కోరుతూ ప్రధాని, పుదుచ్చేరి ముఖ్యమంత్రికి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. యానాం ఘటనతో తెదేపా నిజస్వరూపం బయటపడిందన్నారు. తెదేపాకు చెందిన పరిశ్రమ కావడంతో యాజమాన్యానికి ఆ పార్టీ మద్దతుగా, కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడుతుందన్నారు. తెదేపాతో పాటు మీడియా యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులకు రెండు నెలలుగా జీతాలు రాకున్నా మీడియా పట్టించుకోలేదన్నారు. కార్మికుడి మృతికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉపాధ్యక్షుడి మృతికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. యాజమాన్య వ్యతిరేకత వల్లనే లూటీ జరిగిందని చెప్పారు.