Monday, May 21st

Telugu News - Online Telugu News Portal

దాడి వీరభద్రరావుకు చేదు అనుభవం

జూనియర్ డాక్టర్ల సమస్యలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలిసేందుకు వెళ్లిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావుకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. జూడాల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ దాడి ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు  ఉదయం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయన వాహనాన్ని సీఎం భద్రతా సిబ్బంది లోనికి అనుమతించలేదు. కాగా అదే సమయంలో ప్రముఖ నిర్మాత  రామానాయుడుకు లోనికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతి ఇచ్చారు.

దాంతో భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి వీరభద్రరావు ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించకుండానే వెనుదిరిగారు. ఈ ఘటనపై దాడి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలను అవమానించేలా ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగా క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కార్మిక శాఖ మంత్రి  దానం నాగేందర్, మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లా కలిశారు.